Connect with us

మెట్రోస్టేషన్ల పరిసరాలు ఇక ప్రైవేటీకరణ...!!

మెట్రోరైలు స్టేషన్ల పరిసరాల్లో నిర్వహణ బాధ్యతను ప్రైవేటుకు అప్పగించబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు సర్కారు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వానికి నిర్వహణ వ్యయం భారం కాకుండా టెండర్లు పిలిచి 24 స్టేషన్ల పరిసరాల బాగోగులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు హెచ్‌ఎంఆర్‌ కసరత్తు చేస్తోంది. మెట్రోరైలు ప్రారంభమైన నాగోల్‌ నుంచి మియాపూర్‌ 30 కి.మీ. మార్గంలో 24 మెట్రోస్టేషన్లు ఉన్నాయి. రహదారిపై ప్రతిస్టేషన్‌ ఉన్నచోట అటూ ఇటూ కలిపి 650 నుంచి 700 మీటర్ల దూరం వరకు రూ.2 కోట్లతో హెచ్‌ఎంఆర్‌ సుందరీకరణ పనులు చేపట్టింది. పాదచారుల బాటలు, వాటికి రెయిలింగ్‌, సర్వీసు రోడ్డు, బస్‌బేలు, కియోస్క్‌లు, కొన్నిచోట్ల ప్లాజాలు, గార్డెనింగ్‌ పనులతో అందంగా ముస్తాబు చేసింది. 24 స్టేషన్లలో చాలావరకు ఈ పనులు పూర్తయ్యాయి. పర్యవేక్షణ లేకపోతే పాదచారుల బాటలు, ఇతర సౌకర్యాలు ఆక్రమణకు గురయ్యే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ఆక్రమణలు మొదలయ్యాయి. పర్యవేక్షణ ఉంటే నియంత్రణ సాధ్యమనే ఆలోచనలో హెచ్‌ఎంఆర్‌ ఉంది. ప్రస్తుతం కొన్నిచోట్ల భద్రతా సిబ్బందిని నియమించింది. వీరి జీతాలకు అయ్యే వ్యయం.. మొక్కల నిర్వహణ, ఎప్పటికప్పుడు మరమ్మతు చేయాల్సిన వాటికి అయ్యే ఖర్చు హెచ్‌ఎంఆర్‌కు భారంగా మారనుంది.

 

హెచ్‌ఎంఆర్‌పై గానీ, ప్రభుత్వంపై భారం పడకుండా పీపీపీ పద్ధతిలో స్టేషన్ల పరిసరాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే వినూత్న నిర్ణయం తీసుకుంది. టెండర్‌ దక్కించుకున్న సంస్థ స్టేషన్ల పరిసరాల్లోని బస్సు షెల్టర్లు, కియోస్క్‌లు నిర్మించి వాటి అద్దెల ద్వారా వచ్చే ఆదాయంతో మెట్రోస్టేషన్‌ పరిసరాల నిర్వహణ బాధ్యతలను చూడాలి. దీంతోపాటూ ప్రయాణికుల కోసం హెచ్‌ఎంఆర్‌ మెట్రోస్టేషన్ల చెంతనే రహదారిపై కొన్నిచోట్ల పార్కింగ్‌ సదుపాయం కల్పించింది. ప్రస్తుతం ఇవి ఎండలో ఎండుతున్నాయి. వీటికి భద్రత లేదు. అవకాశం ఉన్నచోట ఆధునిక షెడ్స్‌ నిర్మించి అక్కడ ప్రకటనల బోర్డులు ఏర్పాటుతో ఆదాయం సమకూర్చుకునేలా రూపకల్పన చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎంఆర్‌ నిర్దేశించిన మేర పార్కింగ్‌ రుసుము వసూలు చేసుకోవచ్చు. వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలన్నింటినీ ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ పార్కింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఐఎస్‌పీఎంఎస్‌)లోకి తీసుకు రాబోతున్నారు. వాహనాల భద్రత, ఆన్‌లైన్‌ చెల్లింపు, ఎలక్ట్రానిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్స్‌ వ్యవస్థ, పార్కింగ్‌ ప్రదేశాల్లో స్థితిగతులను తెలుసుకునేలా రియల్‌ టైం అప్‌డేట్స్‌ వంటి సాంకేతికత అమలు చేయనున్నారు. ఈ తరహా సాంకేతికతతో నిర్వహించే వారికే బాధ్యతలను అప్పగించనున్నారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్